Proverbs 30:1-32 in Telugu

Proverbs 30:1
దేవోక్తి, అనగా యాకె కుమారుడైన ఆగూరు పలికిన మాటలు.ఆ మనుష్యుడు ఈతీయేలునకును, ఈతీయేలునకును ఉక్కాలునకును చెప్పినమాట.

Proverbs 30:2
నిశ్చయముగా మనుష్యులలో నావంటి పశుప్రాయుడు లేడు నరులకున్న వివేచన నాకు లేదు.

Proverbs 30:3
నేను జ్ఞానాభ్యాసము చేసికొన్నవాడను కాను పరిశుద్ధ దేవునిగూర్చిన జ్ఞానము పొందలేదు.

Proverbs 30:4
ఆకాశమునకెక్కి మరల దిగినవాడెవడు? తన పిడికిళ్లతో గాలిని పట్టుకొన్నవాడెవడు? బట్టలో నీళ్లు మూటకట్టినవాడెవడు? భూమియొక్క దిక్కులన్నిటిని స్థాపించిన వాడెవడు? ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసియున్నదా?

Proverbs 30:5
దేవుని మాటలన్నియు పుటము పెట్టబడినవే ఆయనను ఆశ్రయించువారికి ఆయన కేడెము.

Proverbs 30:6
ఆయన మాటలతో ఏమియు చేర్చకుము ఆయన నిన్ను గద్దించునేమో అప్పుడు నీవు అబద్ధికుడవగుదువు.

Proverbs 30:7
దేవా, నేను నీతో రెండు మనవులు చేసికొను చున్నాను నేను చనిపోకముందు వాటిని నాకనుగ్రహింపుము;

Proverbs 30:8
వ్యర్థమైనవాటిని ఆబద్ధములను నాకు దూరముగా నుంచుము పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయ చేయకుము తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము.

Proverbs 30:9
ఎక్కువైనయెడల నేను కడుపు నిండినవాడనై నిన్ను విసర్జించి యెహోవా యెవడని అందునేమో లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతు నేమో.

Proverbs 30:10
దాసునిగూర్చి వాని యజమానునితో కొండెములు చెప్పకుము వాడు నిన్ను శపించును ఒకవేళ నీవు శిక్షార్హుడ వగుదువు.

Proverbs 30:11
తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు.

Proverbs 30:12
తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యమునుండి కడుగబడని వారి తరము కలదు.

Proverbs 30:13
కన్నులు నెత్తికి వచ్చినవారి తరము కలదు. వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడియున్నవి!

Proverbs 30:14
దేశములో ఉండకుండ వారు దరిద్రులను మింగు నట్లును మనుష్యులలో ఉండకుండ బీదలను నశింపజేయు నట్లును ఖడ్గమువంటి పళ్లును కత్తులవంటి దవడపళ్లును గల వారి తరము కలదు.

Proverbs 30:15
జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతురులిద్దరు కలరు తృప్తిపడనివి మూడు కలవుచాలును అని పలుకనివి నాలుగు కలవు.

Proverbs 30:16
అవేవనగా పాతాళము, కనని గర్భము, నీరు చాలును అనని భూమి, చాలును అనని అగ్ని.

Proverbs 30:17
తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును పక్షిరాజు పిల్లలు దానిని తినును.

Proverbs 30:18
నా బుద్ధికి మించినవి మూడు కలవు నేను గ్రహింపలేనివి నాలుగు కలవు. అవేవనగా, అంతరిక్షమున పక్షిరాజు జాడ,

Proverbs 30:19
బండమీద సర్పము జాడ, నడిసముద్రమున ఓడ నడచుజాడ, కన్యకతో పురుషుని జాడ.

Proverbs 30:20
జారిణియొక్క చర్యయును అట్టిదే; అది తిని నోరు తుడుచుకొని నేను ఏ దోషము ఎరుగననును.

Proverbs 30:21
భూమిని వణకించునవి మూడు కలవు, అది మోయ లేనివి నాలుగు కలవు.

Proverbs 30:22
అవేవనగా, రాజరికమునకు వచ్చిన దాసుడు, కడుపు నిండ అన్నము కలిగిన మూర్ఖుడు,

Proverbs 30:23
కంటకురాలై యుండి పెండ్లియైన స్త్రీ, యజమాను రాలికి హక్కు దారురాలైన దాసి.

Proverbs 30:24
భూమిమీద చిన్నవి నాలుగు కలవు అయినను అవి మిక్కిలి జ్ఞానముగలవి.

Proverbs 30:25
చీమలు బలములేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును.

Proverbs 30:26
చిన్న కుందేళ్లు బలములేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును.

Proverbs 30:27
మిడుతలకు రాజు లేడు అయినను అవన్నియు పంక్తులు తీరి సాగిపోవును.

Proverbs 30:28
బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు అయినను రాజుల గృహములలో అది యుండును.

Proverbs 30:29
డంబముగా నడుచునవి మూడు కలవు ఠీవితో నడుచునవి నాలుగు కలవు

Proverbs 30:30
​అవేవనగా ఎల్లమృగములలో పరాక్రమముగలదై ఎవనికైన భయపడి వెనుకకు తిరుగని సింహము

Proverbs 30:31
శోణంగి కుక్క, మేకపోతు, తన సైన్యమునకు ముందు నడుచుచున్న రాజు.

Proverbs 30:32
నీవు బుద్ధిహీనుడవై అతిశయపడి యుండినయెడల కీడు యోచించి యుండినయెడల నీ చేతితో నోరు మూసికొనుము.

Telugu Bible