Lamentations 4:1-21 in Telugu
Lamentations 4:1
బంగారము ఎట్లు మందగిలినది? మేలిమి బంగారము ఎట్లు మార్చబడినది? ప్రతి వీధి మొగను ప్రతిష్టితమైన రాళ్లు పారవేయ బడియున్నవి.
Lamentations 4:2
మేలిమి బంగారముతో పోల్చదగిన సీయోను ప్రియ కుమారులు ఎట్లు కుమ్మరి చేసిన మంటికుండలుగా ఎంచబడు చున్నారు?
Lamentations 4:3
నక్కలైనను చన్నిచ్చి తమ పిల్లలకు పాలిచ్చును నా జనుల కుమారి యెడారిలోని ఉష్ట్రపక్షులవలె క్రూరురాలాయెను.
Lamentations 4:4
దప్పిచేత చంటిపిల్ల నాలుక వాని అంగిటికి అంటు కొనును పసిపిల్లలు అన్నమడుగుదురు ఎవడును వారికి పెట్టడు.
Lamentations 4:5
సుకుమార భోజనము చేయువారు దిక్కు లేక వీధులలో పడియున్నారు రక్తవర్ణ వస్త్రములు తొడిగి పెంచబడినవారు పెంట కుప్పలను కౌగిలించుకొనెదరు.
Lamentations 4:6
నా జనుల కుమారి చేసిన దోషము సొదొమ పాపముకంటె అధికము ఎవరును దా నిమీద చెయ్యి వేయకుండనే నిమిషములో ఆ పట్టణము పాడుచేయబడెను.
Lamentations 4:7
దాని ఘనులు హిమముకన్న శుద్ధమైనవారు వారు పాలకంటె తెల్లనివారు వారి శరీరములు పగడములకంటె ఎఱ్ఱనివి వారి దేహకాంతి నీలమువంటిది.
Lamentations 4:8
అట్టివారి ఆకారము బొగ్గుకంటె నలుపాయెను వారిని వీధులలో చూచువారు వారిని గురుతు పట్ట జాలరు. వారి చర్మము వారి యెముకలకు అంటుకొనియున్నది అది యెండి కఱ్ఱవంటిదాయెను.
Lamentations 4:9
క్షామహతులు భూఫలములు లేక పొడువబడి క్షీణించి పోయెదరు ఖడ్గహతులు క్షామహతులకన్న భాగ్యవంతులు.
Lamentations 4:10
వాత్సల్యముగల స్త్రీల చేతులు తాము కనిన పిల్లలను వండుకొనెను నా జనుల కుమారికి వచ్చిన నాశనములో వారి బిడ్డలు వారికి ఆహారమైరి.
Lamentations 4:11
యెహోవా తన ఉగ్రతను నెరవేర్చి తన కోపాగ్నిని కుమ్మరించెను సీయోనులో ఆయన అగ్ని రాజబెట్టెను అది దాని పునాదులను కాల్చివేసెను.
Lamentations 4:12
బాధించువాడుగాని విరోధిగాని యెరూషలేము గవునులలోనికి వచ్చునని భూరాజులకైనను లోకనివాసులందరిలో మరి ఎవరి కైనను తోచియుండలేదు.
Lamentations 4:13
దానిలో నీతిమంతుల రక్తమును ఓడ్చిన దాని ప్రవక్తల పాపములనుబట్టియు దాని యాజకుల దోషమునుబట్టియు
Lamentations 4:14
జనులు వీధులలో అంధులవలె తిరుగులాడెదరు వారు రక్తము అంటిన అపవిత్రులు ఎవరును వారి వస్త్రములను ముట్టకూడదు.
Lamentations 4:15
పొమ్ము అపవిత్రుడా, పొమ్ము పొమ్ము ముట్టవద్దని జనులు వారితో ననిరి. వారు పారిపోయి తిరుగులాడుచుండగా అన్యజనులైన వారు ఇకను వారిక్కడ కాపురముండకూడదని చెప్పు కొనిరి
Lamentations 4:16
యెహోవా సన్నిధిని వారిని చెదరగొట్టెను ఆయన ఇకమీదట వారిని లక్ష్యపెట్టడు యాజకులయెడల జనులు గౌరవము చూపకపోయిరి పెద్దలమీద దయ చూపకపోయిరి.
Lamentations 4:17
వ్యర్థసహాయముకొరకు మేము కనిపెట్టుచుండగా మా కన్నులు క్షీణించుచున్నవి మేము కనిపెట్టుచు రక్షింపలేని జనముకొరకు ఎదురు చూచుచుంటిమి.
Lamentations 4:18
రాజవీధులలో మేము నడువకుండునట్టు విరోధులు మా జాడలనుబట్టి వెంటాడుదురు మా అంత్యదశ సమీపమాయెను మా దినములు తీరిపోయినవి మా అంత్యదశ వచ్చే యున్నది.
Lamentations 4:19
మమ్మును తరుమువారు ఆకాశమున ఎగురు పక్షిరాజుల కన్న వడిగలవారు పర్వతములమీద వారు మమ్మును తరుముదురు అరణ్యమందు మాకొరకు పొంచియుందురు.
Lamentations 4:20
మాకు నాసికారంధ్రముల ఊపిరివంటివాడు యెహోవాచేత అభిషేకము నొందినవాడు వారు త్రవ్విన గుంటలలో పట్టబడెను.
Lamentations 4:21
అతని నీడక్రిందను అన్యజనుల మధ్యను బ్రదికెదమని మేమనుకొన్నవాడు పట్టబడెను. ఊజు దేశములో నివసించు ఎదోము కుమారీ, సంతోషించుము ఉత్సహించుము ఈ గిన్నెలోనిది త్రాగుట నీ పాలవును నీవు దానిలోనిది త్రాగి మత్తిల్లి నిన్ను దిగంబరినిగా చేసికొందువు
Telugu Bible